ఆదిలోనే అంతం..వరి పంట దుస్థితి..ఆందోళన
ఆదిలోనే అంతం..వరి పంట దుస్థితి..ఆందోళన

యాసంగి వరి నాట్లు వేసి 20 రోజులైనా కానే లేదు
తిమ్మాపూర్,జనవరి 15 (విశ్వం న్యూస్) : ‘మోగి పురుగు’ రూపంలో వరి పంటలో తెగులు సోకి వరి నాట్లు పూర్తిగా నాశనం అవుతున్నాయి. దీనితో తెలంగాణ జిల్లాల్లోని రైతులు వరి పంటలో తెగుళ్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లి గ్రామంలో ఆదివారం తెగులు సోకిన వరి నాట్లను సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి ఆధ్వర్యంలో వరి పంట పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బోయిని తిరుపతితో పాటు రైతులు మాట్లాడుతూ…యాసంగి పంటలు వేసినా ఆదిలోనే మోగి పురుగు తెగులు సోకి వరినట్లు చాలా వరకు దెబ్బ తింటున్నాయి అని, చాలా గ్రామాలలో వరి పొలాలు ఇదే రకంగా తెగుళ్లు సోకి దెబ్బతింటున్నాయి. రైతులు ఎన్ని రకాల మందులు కొట్టిన ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికే చాలా ఎకరాలలో వరి పంటలో పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు తెలిపారు. వెంటనే ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, వ్యవసాయ అధికారులు వరి పంటకు తెగుళ్లపై తక్షణమే స్పందించి, నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి, ప్రభుత్వం ద్వారా ప్రత్యామ్నాయం కల్పించే విధంగా కృషి చేయాలని, నష్టపోతున్న వరినాట్ల పైన పూర్తిస్థాయి నివేదిక తయారుచేసి నష్టపోయిన రైతులకు ప్రభు త్వం నుండి తగిన నష్టపరిహారం అందే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తిమ్మాపూర్ మండల కార్యదర్శి బోయిని తిరుపతి, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి ముత్త ఎల్లస్వామి, నాయకులు గుంటి అయిలయ్య, పుప్పారపు తిరుపతితో పాటు రైతులు, తదితరులు పాల్గొన్నారు.
