కష్టార్జితంపై ప్రభుత్వ కత్తి

- రిటైర్మెంట్ ప్రయోజనాల సొమ్ములందక ఇక్కట్లు
- నా కష్టార్జితం 60 లక్షలు… చేతికందడం లేదు!”
- — తాటికొండ పరిపూర్ణ చారి, రిటైర్డ్ ఏఎస్‌ఐ (పోలీస్ శాఖ)
హైదరాబాద్, నవంబర్ 11 (విశ్వం న్యూస్): పోలీస్ యూనిఫాం వేసుకుని 30 ఏళ్లపాటు నేరగాళ్లను ఎదుర్కొన్న, ప్రజల కోసం తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన మాజీ ఏఎస్‌ఐ తాటికొండ పరిపూర్ణ చారి ఇప్పుడు ప్రభుత్వ దౌర్జన్యానికి బలి అవుతున్నాడు. రిటైర్మెంట్ ప్రయోజనాలుగా రావాల్సిన రూ.60 లక్షలకు పైగా మొత్తం నెలలుగా బూడిదలో కాలిపోతోంది. తాను సంపాదించిన కష్టార్జితం తనకే అందడం లేదు.

2024 మార్చి తర్వాత పదవీ విరమణ-“గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఆర్జిత సెలవుల సొమ్ములు—మొత్తం 60 లక్షలు రావాలి. కానీ రిటైర్ అయ్యాక ప్రశాంత జీవితం గడపాలనుకుంటే… నా కష్టార్జితం చేతికందక కార్యాలయాల దగ్గర తిరుగుతున్నా. EMI కట్టలేకపోయా… నా ఇల్లు సీజ్ చేశారు. రాత్రంతా నిద్ర రావడం లేదు. నేను 30 ఏళ్లు పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఎందుకు సేవ చేశానని నేనే నన్ను అడుగుకుంటున్నా,” అన్న ఆయన వాక్కులు ఎవరి మనసునైనా కలచివేస్తాయి.

రోజు రోజుకూ ఋణాలు పెరుగుతున్నాయి, వైద్య ఖర్చులు భరించలేక నలుగుతున్నాడు. శరీరం తోడ్పడకున్నా—ఫైళ్లు, ఆఫీసులు, సంతకాలు, సర్టిఫికెట్లు అంటూ చుట్టూ తిరగాల్సి వస్తోంది.

ప్రభుత్వం నోట మాటలు—జీవితకాలం సేవ చేసిన ఉద్యోగికి గౌరవం—ప్రాక్టీస్‌లో మాత్రం అవమానమే. 60 లక్షలు చేతికి రావాలంటే ఎన్ని రోజులు? ఎన్ని వారం? ఎన్ని నెలలు? ఎవరికీ సమాధానం లేదు.
“సేవ చేసిన వారికి సేవ లేదు… న్యాయం ఎప్పుడు?”
విశ్రాంత ఉద్యోగుల ఈ అరుపు ప్రభుత్వాన్ని కదిలిస్తుందా… లేదంటే ఇదీ ఇంకో ‘ఫైల్ పెండింగ్’ కథేనా?