పేదల ఆత్మ బంధువుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది

> రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
> వ్యవసాయాన్ని పండుగ చేసిన అసలైన రైతు నాయకుడు కేసీఆర్
పెద్దపల్లి, జనవరి 6 (విశ్వం న్యూస్) : పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న అసలైన పేదల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ధర్మారం మండలం నంది మేడారంలో 7 కోట్ల 32 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ధర్మారం మండలం నంది మేడారం గ్రామంతో తనకు చాలా దగ్గర సంబంధం ఉందని, నీటిపారుదల శాఖ మంత్రిగా 50 సార్లు గ్రామంలో పర్యటించడం జరిగిందని, కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంలో కొప్పుల ఈశ్వర్, ఇక్కడి ప్రజల సహకారం కీలకమని మంత్రి పేర్కొన్నారు. నంది మేడారం గ్రామ ప్రజలు అందించిన సహకారం గుర్తించుకుని 7.32 కోట్ల వ్యయంతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశామని, 6 నెలలలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి వైద్యులు, ఆధునిక పరికరాలతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణానికి ఆరు ఎకరాల భూమి దానం చేసిన శ్రీధర్ రావు, నర్సింగ్ రావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లాలో అధిక శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్నా యని, వీటిని మరింత పెంచాల్సిన బాధ్యత మనపై ఉందని, ఆశా కార్యకర్తలు తమ పరిధిలో అధికంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా పనిచేయాలని మంత్రి సూచించారు.
ప్రజలు అడక్కుండానే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో తగ్గించారని, మహిళలు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో ఇంటింటికి నల్ల నీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని, మహిళలు చదువుకునేందుకు నాలుగు వందల రెసిడెన్షియల్, పాఠశాలలు 78 రెసిడెన్షియల్ కళాశాలలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఉద్యోగాల జాతర సాగుతుందని , ఇప్పటికే 1.3 లక్షల ఉద్యోగాలు రాష్ట్రం వచ్చిన తర్వాత భర్తీ చేశామని, ప్రస్తుతం మరో 80వేల ఉద్యోగాల భర్తీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే 45 వేల నోటిఫికేషన్ జారీ చేశామని, దీని పై కొందరు విషం కక్కుతున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే దీని వెనుక కుట్ర ఉందని బీజేపీ అధ్యక్షుడు మాట్లాడటం హాస్యాస్పదమని, ఎవరైనా ఇంకొన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతారని, ఉద్యోగాలు భర్తీ చేస్తే మా రాజకీయ పబ్బం ఎలా గడుపుకోవాలని ఆలోచించడం దుర్మార్గమని మంత్రి తెలిపారు వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీలు లేకుండా పూర్తిస్థాయిలో భర్తీ ప్రక్రియ చేపట్టామని, 950 వైద్యులకు నియామక పత్రాలు అందించామని, 1345 వైద్యులు, 5250 స్టాఫ్ నర్సులు, 3వేల పైగా అసోసియేట్ ప్రొఫెసర్ నియామక ప్రక్రియ జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఉద్యోగాలు కల్పించడం బిఆర్ఎస్ వంతు, ప్రభుత్వ సంస్థలను అమ్మడం బీజేపీ వంతని, బిపిసిఎల్, ఎల్.ఐ.సి సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు చేస్తున్న బీజేపీ తో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. బొగ్గు బావులను ప్రైవేటుపరం చేయకుండా సింగరేణి సంస్థకు అందిస్తే అదనంగా తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం పై సీఎం కేసీఆర్ కున్న అవగాహన ఏ నాయకుడికి లేదని, పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ వెనుక మనమంతా అండగా ఉండాలని, తెలంగాణలో జరుగుతున్న మంచి పనులు దేశవ్యాప్తంగా అమలు చేయాలని మంత్రి తెలిపారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, వైద్య రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి హరీష్ రావు నిర్విరామ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయమూర్తి పోంగోటి నవీన్ రావ్ , పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ధర్మారంజడ్పిటిసి పూస్కూరి పద్మాజా జితేందర్ రావు, ఎంపిపి ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 30 పడకల సి.హెచ్.సి. ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, డి.సి.హెచ్.ఎస్. శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
