హుజురాబాద్ : 150 కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్

- అన్ని వర్గాలకు వ్యాపార అవకాశాలు.. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన వాణిజ్య సముదాయం
హుజురాబాద్, ఆగస్టు 9: హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, బస్టాండ్ ఎదురుగా ఉన్న ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్ సుమారు 150 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో ముళ్లపొదలు, చెత్తాచెదారంతో ఉన్న ఈ స్థలంలో సుమారు 11 ఏళ్ల క్రితం జామే మసీద్, ఈద్గా, కబ్రిస్తాన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.


కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, కీర్తిశేషులు మహమ్మద్ వహిదుల్లా ఖాన్ జనరల్ సెక్రటరీగా, మహమ్మద్ అబ్దుల్ అజీజ్ కోశాధికారిగా వ్యవహరించగా.. మహమ్మద్ జాఫర్, మహమ్మద్ సలీం, మహమ్మద్ నవాబ్ పాషా, సయ్యద్ అబ్దుల్, మహమ్మద్ హుస్సేన్ షరీఫ్, మహమ్మద్ మజారుద్దీన్, సయ్యద్ మునీరుద్దీన్, మహమ్మద్ బాషు మియా తదితరుల సహకారంతో ఈ నిర్మాణం చేపట్టారు.

ఐదు మసీదుల ఇమామ్‌లు, మౌజన్లకు వేతనాలు : షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా సమకూరుతున్న ఆదాయంతో ఐదు మసీదులకు చెందిన ఇమామ్‌లు, మౌజన్లకు నెలవారీ వేతనాలు చెల్లించే అవకాశం కలిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. జామే మసీద్ ద్వారా ప్రతి నెల వారికి క్రమం తప్పకుండా జీతాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
గంగా జమునా తహజీబ్‌కు ప్రతీక : అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లో అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించడంపై వ్యాపారులు కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. హిందూ, ముస్లింలు సోదరభావంతో కలిసి మెలిసి జీవిస్తూ, గంగా జమునా తహజీబ్‌ను కొనసాగిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు.
ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ద్వారా 150 కుటుంబాలకు ఉపాధి కల్పించడంతో పాటు, మత సామరస్యం, సోదరభావానికి ఈ వాణిజ్య సముదాయం ప్రతీకగా నిలుస్తోందని వ్యాపారులు అభిప్రాయపడ్డారు.