పకడ్బందీగా కంటి వెలుగు అమలు చేసి ప్రజల దీవెనలు పొందాలి

పకడ్బందీగా కంటి వెలుగు అమలు చేసి ప్రజల దీవెనలు పొందాలి

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి, జనవరి 11 (విశ్వం న్యూస్) : జిల్లాలో ఈ నెల 18 నుండి నిర్వహించు రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం తో సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సులో పాల్గొని ప్రజా ప్రతినిధులు, అధికారులకు కంటి వెలుగు సమర్థవంతంగా నిర్వహణపై అవగాహన కల్పించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారి కళ్ళలో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం తీసుకొచ్చిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఆలోచించని విధంగా గ్రామీణ ప్రజల చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని, ఓ ప్రముఖ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఉన్న దృష్టి లోపం సమస్యలో 50% మేరకు భారతదేశంలో ఉన్నాయని, ప్రజలు అధికంగా నిర్లక్ష్య ధోరణి కారణంగా సమస్య తీవ్రతరం అయ్యే వరకు తెలియదని మంత్రి తెలిపారు. సమాజంలో ఉన్న వృద్ధులకు కంటి సమస్యలు అధికంగా ఉంటాయని, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆసుపత్రి వెళ్ళరని, అలాంటి లక్షలాది ప్రజలకు కంటి వెలుగు దోహదపడుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ: అంధత్వ నివారణ కొరకు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన 100% జనాభాకు కంటి వెలుగు కింద పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు.

జడ్పీ చైర్మన్ పుట్ట మదూకర్ : జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పాల్గొని నిర్వహించుకునే కార్యక్రమం కంటి వెలుగు అని, దీని ద్వారా ప్రజలకు సేవ చేసే బృహత్తర అవకాశం లభిస్తుందని, పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేతకాని : సర్వెంద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారని, అలాంటి కంటి సంరక్షణ కోసం ప్రభుత్వం భారి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీలు, ఎం.పి.పి.లు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, మునిసిపల్ కమిషనర్ లు, ఎంపిడిఓలు, మండల ప్రత్యేక అధికారులు, కంటివెలుగు మెడికల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *