
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విశ్వం న్యూస్) : వెలిజ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్ధన రావు దారుణ హత్యకు గురయ్యారు. గురవారం ( ఫిబ్రవరి 6) రాత్రి హైదరాబాద్ బేగంపేటలోని తన నివాసంలో ఆయన్ను హత్య చేశారు. సొంత మనవడే ఆయన్ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
జనార్దనరావు మనవడు కిలారు కీర్తితేజ (కూతురు సరోజినిదేవి కుమారుడు), అత్యంత కిరాతకంగా 73 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ మేరకు నిందితుడు కీర్తితేజను పంజాగుట్ట బీమా జ్యువెల్లర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గత కొంత కాలంగా ఆస్తి కోసం మనవడు తాతతో గొడవ పడుతున్నాడు. దీంతో జనార్దనరావు తన మనవడు కీర్తితేజ పేరిట రూ.4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. జనార్దనరావు కుమార్తె సరోజినీదేవి భర్తతో విభేదాలు రావడంతో తండ్రి వద్దే ఉంటుంది. ఆమె కుమారుడు కిలారు కీర్తితేజ తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటున్నాడు. డ్రగ్స్‌కు అలవాటుపడిన కీర్తితేజ.. గత కొంత కాలంగా తాతను హింసిస్తున్నాడు. అందులో భాగంగానే ఆస్తి కోసం దారుణంగా హత్య చేశాడు.