క్రీడలతోనే సర్వతోముఖాభివృద్ధి
సాధ్యం:మామునూరు సీఐ రమేష్

వరంగల్, ఫిబ్రవరి 8 (విశ్వం న్యూస్) : క్రీడల ద్వారా మానసిక, శారీరక మరియు ఆరోగ్య పరంగా సమగ్ర అభివృద్ధి సాధ్యమని మామునూరు సీఐ రమేష్ అన్నారు. శనివారం వరంగల్ నగర శివారులోని బొల్లికుంట వద్ద వాగ్దేవి విద్యాసంస్థల క్రీడా మైదానంలో 11వ రాష్ట్రస్థాయి పురుషుల సీనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన సూచించారు.
తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పి. సాంబశివరావు, ఆల్ ఇండియా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శోభన్ బాబు మాట్లాడుతూ, తెలంగాణలో క్రీడాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాదిలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా సాఫ్ట్‌బాల్ నేషనల్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.

సాఫ్ట్‌బాల్ అభివృద్ధిలో వరంగల్ జిల్లా ప్రత్యేక స్థానం
హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్, కోశాధికారి వి. వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి మాట్లాడుతూ, తెలంగాణలో సాఫ్ట్‌బాల్ క్రీడలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, దీనిని మరింత విస్తరించేందుకు అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు. అనేక మంది క్రీడాకారులను తీర్చిదిద్దటంలో, ఉద్యోగ అవకాశాల కల్పనలో అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

21 జట్లు పోటీలో
మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ సునీల్ రెడ్డి, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ గౌడ్, ఇండియన్ కోచ్ కృష్ణ, కాకతీయ మెడికల్ కళాశాల సూపరిండెంట్ ప్రమోద్ కుమార్, హనుమకొండ లయన్స్ ప్రెసిడెంట్ రేవూరి రమణారెడ్డి, రుద్రమదేవి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ రోహిణి, వాగ్దేవి కళాశాల విభాగాధిపతి అజయ్ రెడ్డి, నల్గొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ నాగిరెడ్డి, చీఫ్ రెఫరీ మెదక్ జిల్లా సెక్రటరీ శ్యాంసుందర్ శర్మ, ఇతర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు, ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.