లక్ష కోట్లు దోచుకున్నోడు, తాగుబోతోడు, తెలంగాణ ప్రజల రక్తం తాగినోడు తెలంగాణ జాతిపిత కాదు

  • హరీశ్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్

హైదరాబాద్, మార్చి 16 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయమై చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, కోయిల్ సాగర్, మంజీరా ప్రాజెక్టులపై ఏ విధంగా అభివృద్ధి జరిగిందో హరీశ్ రావు ముందుకు వచ్చి చర్చించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

“పిల్ల కాకులకేం తెలుసు… వాళ్లు వీళ్లు కాదు, కేసీఆర్ నువ్వే రా” అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఎలా ఉంటుందో 2023లో ఇప్పటికే ప్రజలు చూపించారని గుర్తుచేశారు.

కేసీఆర్‌పై కఠిన విమర్శలు
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “అధికారంలో ఉన్నప్పుడు తప్ప కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు. ఆయన స్వయంగా రాకుండా తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావును ప్రజల్లోకి పంపుతున్నారు. బయటకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? జీతభత్యాలు ఎందుకు?” అని ప్రశ్నించారు.

కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దగా శ్రమించలేదని విమర్శిస్తూ, “క్యాప్సికం పండిస్తే కోట్లు వస్తాయన్న కేసీఆర్… ఆ టెక్నిక్ ఏమిటో ప్రజలకు చెప్పండి. నీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యం ఏంటో ప్రజలకు వివరించండి. వెయ్యిమంది యువకులను నీ ఫామ్ హౌస్‌కు పంపిస్తా, వారికి నీ టెక్నిక్ నేర్పించండి” అని సెటైర్లు వేశారు.

తెలంగాణ జాతిపిత ఎవరూ?
కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి, “తెలంగాణ జాతిపిత అంట… ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? ఈ జాతిపిత మందు వాసన లేకుండా నిద్ర లేస్తాడా?” అని విమర్శించారు. తెలంగాణకు నిజమైన జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ అని పేర్కొన్నారు. “లక్ష కోట్లు దోచుకున్నోడు, తాగుబోతోడు, తెలంగాణ ప్రజల రక్తం తాగినోడు తెలంగాణ జాతిపిత కాదు” అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రాజకీయాల్లో విభేదాలు మళ్లీ చెలరేగుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *