పెళ్లి బృందం బస్సు
ఘోర ప్రమాదం

- అదుపు తప్పిన బస్సు ఇంటిని ఢీకొట్టి ప్రమాదం
- బస్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి
మహబూబాబాద్, ఆగస్టు 31 (విశ్వం న్యూస్) : మహబూబాబాద్ జిల్లా దంతాల పల్లి మండల కేంద్రం వద్ద ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందాన్ని తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
హనుమకొండకు చెందిన యువకుడికి ఖమ్మం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగిన నేపథ్యంలో, వరుడి బంధువులు 30 మందికి పైగా ఓ ట్రావెల్ బస్సులో వివాహానికి వెళ్లారు. వివాహం అనంతరం తిరుగు ప్రయాణంలో దంతాలపల్లి మసీదు సమీపంలో బస్సు రోడ్డుపై గుంతల కారణంగా అదుపుతప్పి రహదారి పక్కనున్న ఇంటి గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హనుమకొండకు చెందిన బస్సు డ్రైవర్ దేవేందర్ (38) అక్కడికక్కడే మృతి చెందగా, క్లీనర్ సాయికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.