
డోర్నకల్, డిసెంబర్ 28 (విశ్వం న్యూస్) : డోర్నకల్ నియోజకవర్గం నర్సింహులపేట మండలం బస్తారాంతండాలో రైతుల ఆర్తనాదాలు హృదయాలను కదిలించాయి. వానలు పడి పంట చేతికొచ్చే దశలో ఉండగా, అవసరమైన యూరియా లేక రైతులు రోడ్డెక్కారు. “ఒక్క బస్తా యూరియా ఇవ్వండి సార్.. పంట కాపాడండి” అంటూ అధికారుల ముందు కాళ్లమీద పడి మొక్కిన దృశ్యాలు అక్కడ విషాదాన్ని నింపాయి.

పత్తి, వరి, మిర్చి వంటి పంటలు కీలక దశలో ఉండగా యూరియా సరఫరా లేకపోవడం రైతులను నిస్సహాయ స్థితికి నెట్టింది. సహకార సొసైటీలు, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ రోజులు తరబడి తిరుగుతున్నా ఫలితం శూన్యమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు చేతిలో ఉన్నా, సరుకే లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. “వానలు వచ్చాయి… ఇప్పుడు యూరియా లేకపోతే పంట నాశనం. అప్పులు చేసి సాగు చేశాం. ఇప్పుడు బస్తా యూరియా కోసం కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి వచ్చింది” అని రైతులు కన్నీళ్లతో చెప్పారు. కొందరు రైతులు తమ కుటుంబ పోషణ, పిల్లల చదువుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవసాయ సీజన్‌లోకి అడుగుపెట్టిందని, యూరియా సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని రైతులు మండిపడ్డారు. తక్షణమే యూరియా సరఫరా చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూరియా కొరతపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి వెంటనే సరఫరా చేయాలని, లేకపోతే రైతుల ఆగ్రహం మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు.