బండి కొడుకు పరారు

హైదరాబాద్, మే 12: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదైన తరువాత నుంచి భగీరథ్ పరారీలో ఉండటంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మూడు రోజులుగా అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటం విచారణలో కీలక అంశంగా మారింది.
ఈ కేసు విచారణను నిర్వహిస్తున్న అధికారి రితిరాజ్ మీడియాతో మాట్లాడుతూ, “నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కాల్ డీటైల్ రికార్డులు (CDR) పరిశీలిస్తున్నాం. ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి” అని తెలిపారు. కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని, అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని చెప్పారు.
ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్‌ను పోలీసులు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు, సంఘటనల క్రమాన్ని స్పష్టంగా తెలుసుకునేందుకు మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. బాధితురాలికి అవసరమైన రక్షణ, గోప్యత కల్పిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ కేసుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా, బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, పూర్తి వివరాలు బయటకు రాకముందే రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం తగదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఫోన్ రికార్డులు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. నిందితుడి ఆచూకీ లభించిన వెంటనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.