బొంతు రామ్మోహన్ నుంచి ప్రాణహాని ఉంది..

హైదరాబాద్, మే 21 (విశ్వం న్యూస్):హైదరాబాద్, అమీర్పేట్లో నిర్వహిస్తున్న ఏషియన్ హాస్టల్కు సంబంధించిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్, ఆయన కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని హాస్టల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2 కోట్లు అడ్వాన్స్ రూపంలో తీసుకొని భవనాన్ని అద్దెకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తూ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
హాస్టల్ నిర్వాహకుల కథనం ప్రకారం.. భవనం ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తూ బొంతు రామ్మోహన్ కుటుంబ సభ్యులు తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. హాస్టల్ నిర్వాహకురాలిని పోలీసుల సమక్షంలోనే జుట్టు పట్టుకొని కొట్టారని, ఈ ఘటనతో మహిళలు భయాందోళనలకు గురయ్యారని చెప్పారు.
అంతేకాకుండా తమ డబ్బులు తిరిగి ఇవ్వకుండా అక్రమ కేసులు బనాయించి పోలీసులను పంపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బొంతు శ్రీదేవి సుమారు 30 మంది వ్యక్తులతో హాస్టల్లో కూర్చొని భయపెడుతోందని తెలిపారు. నగరం నడిబొడ్డున ఇలాంటి అరాచకాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని రక్షణ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని హాస్టల్ నిర్వాహకులు కోరారు.

- బొంతు రామ్మోహన్ అరాచకాలను ఖండించిన మంత్రి శ్రీదేవి
- “రూ.2 కోట్లు తీసుకొని ఇప్పుడు రౌడీలతో దాడులా?.. బాధితులకు వెంటనే న్యాయం చేయాలి”
- కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్, ఆయన కుటుంబ సభ్యులపై హాస్టల్ నిర్వాహకులు చేసిన ఆరోపణలను మంత్రి శ్రీదేవి తీవ్రంగా ఖండించారు. డబ్బులు తీసుకొని భవనాన్ని అద్దెకు ఇచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడం, మహిళలపై దాడులకు పాల్పడటం దారుణమని ఆమె మండిపడ్డారు.
- ముఖ్యంగా మహిళా నిర్వాహకురాలిని పోలీసుల సమక్షంలోనే జుట్టు పట్టుకొని కొట్టడం అమానుషమని మంత్రి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం నడిబొడ్డున ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రౌడీయిజానికి పాల్పడటం అసలు సహించబోమన్నారు.