చిన్నపత్రికలు,
డెస్క్ జర్నలిస్టులకు
అక్రిడిటేషన్లు పెంచాలి

- సమాచార శాఖ స్పెషల్ కమిషనర్‌కు టీడబ్ల్యూజేఎఫ్ వినతి
హైదరాబాద్, మే 18 (విశ్వం న్యూస్) : రాష్ట్రవ్యాప్తంగా చిన్న పత్రికలకు ప్రింటింగ్ ఎడిషన్ల వారీగా అక్రిడిటేషన్ కార్డుల సంఖ్యను పెంచాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. అదే విధంగా డెస్క్ జర్నలిస్టులకు కూడా ప్రింటింగ్ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో అక్రిడిటేషన్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా సూచించింది.
ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ జి. ముకుందరెడ్డికి ఫెడరేషన్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
చిన్న పత్రికలకు ఉమ్మడి జిల్లాల వారీగా పబ్లికేషన్ కేంద్రాల్లో ప్రతి నియోజకవర్గానికి రెండు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని కోరారు. ఈ అంశాన్ని ఇప్పటికే రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్రిడిటేషన్ జీవోలను సవరించి చిన్నపత్రికలకు మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
డెస్క్ జర్నలిస్టులకు అదనపు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కూడా కోరారు. ప్రింటింగ్ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో పనిచేసే డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్లు కేటాయించాలని స్పెషల్ కమిషనర్‌ను విన్నవించారు. డెస్క్ జర్నలిస్టుల విధులు, వారి సేవల ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా వివరించారు.
అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ సమావేశాలకు కార్మిక శాఖ గుర్తించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకత్వాన్ని కోర్టు తీర్పు వచ్చేవరకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని కోరారు. సమస్యల పరిష్కారానికి స్పెషల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ, బి. రాజశేఖర్, కార్యదర్శులు ఈ. చంద్రశేఖర్, గండ్ర నవీన్ తదితరులు పాల్గొన్నారు.