బస్తీల దుస్థితిపై దాసోజు ఫైర్

ఖైరతాబాద్‌లో ప్రజా సమస్యలను గాలికొదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు

హైదరాబాద్, మే 19 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో బస్తీవాసులు దారుణ పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, అంబేద్కర్ నగర్ బస్తీలలో స్థానిక నాయకులు జేజోళ్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో పర్యటించిన ఆయన, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండ్. అక్తర్, రమేష్, బస్వ గౌడ్, రాములు, శశికల తదితరులు పాల్గొన్నారు.

మీడియాతో మాట్లాడిన డా. శ్రవణ్ దాసోజు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలో ప్రభుత్వం మునిగిపోయింది. బస్తీల అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది” అని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాల్సిన మంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారాలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు.

స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఫిరాయింపుల నేపథ్యంలో తన ఎమ్మెల్యే పదవి ఎప్పుడు ఊడిపోతుందోనని భయంతో ఆయన బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారు” అని అన్నారు.

బస్తీలలో నెలకొన్న సమస్యలను వివరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో డ్రైనేజీ, నాలా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు. మహమ్మదియా మస్జిద్ పక్కన రోడ్లు, నాలాలు మరమ్మతులు కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అంబేద్కర్ నగర్‌లో గత రెండు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వస్తున్న నీటిలో డ్రైనేజీ కలుస్తుండటంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

“ఇదేనా తెలంగాణ రైజింగ్? పేపర్ ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. గ్లోబల్ సిటీ అని చెప్పుకునే హైదరాబాద్‌లో బస్తీల పరిస్థితి దారుణంగా ఉంది” అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలాంగి ఎల్. కర్ణన్, జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *