అర్ధరాత్రి భయానక ఘటన..
మంటల్లో చిక్కుకున్న బస్సు

నల్లగొండ, మే 30 (విశ్వం న్యూస్): నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న రైన్బో ట్రావెల్స్‌కు చెందిన బస్సు (NL07 B 0886)లో శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బస్సు ఇంజిన్ భాగం నుంచి పొగలు, మంటలు వస్తున్నట్లు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డుపక్కన నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ చాకచక్యంతో అందరూ క్షేమంగా బయటపడగా, ప్రయాణికుల లగేజీ, ఇతర వస్తువులు మాత్రం మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. తమ సామగ్రి కాలిపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.