
హైదరాబాద్, జూన్ 19 (విశ్వం న్యూస్): రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.
ఒకవైపు “రైతు పండించిన ప్రతి గింజను కొంటాం” అని హామీ ఇవ్వడం, మరోవైపు “కేంద్రం కోటా మాత్రమే కొంటాం” అని ప్రకటించడం పరస్పర విరుద్ధమైన ప్రకటనలని ఆయన పేర్కొన్నారు. అసలు ఏది నిజమో, ఎవరిని నమ్మాలో రైతులకు అర్థం కావడం లేదన్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతుల వద్దకు వెళ్లి ఇచ్చిన మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కడం నమ్మకద్రోహం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు.
అన్నదాతల జీవితాలతో చెలగాటం ఆడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది అధికార అహంకారమా, లేక పరిపాలనా అసమర్థతా అన్నది ప్రజలే నిర్ణయించాలని అన్నారు. రైతుల కష్టార్జిత పంటకు గిట్టుబాటు కల్పించాల్సిన ప్రభుత్వం, వారిని అనిశ్చితిలోకి నెట్టడం దురదృష్టకరమన్నారు.
రైతు సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు రైతుల పాలిట శాపంగా మారిందని దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.