డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు: శ్రవణ్ దాసోజు

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల
కేటాయింపుల్లో భారీ
అక్రమాలు: దాసోజు

హైదరాబాద్, జూన్ 19: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఐమాక్స్ థియేటర్ ఎదురుగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ భారీ అక్రమాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆరోపించారు. బాధిత పేదలు, దళిత-బహుజన కుటుంబాలతో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.

భూములిచ్చిన వారికే అన్యాయం : గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదల ఆత్మగౌరవ జీవనానికి ఉద్దేశించి 210 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారని శ్రవణ్ దాసోజు గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు కోసం స్థానిక పేదలు, దళిత కుటుంబాలు తమ సొంత భూములను ప్రభుత్వానికి అప్పగించారని, ఇప్పుడు వారికి ఇళ్లు ఇవ్వకుండా ఇతరులకు కేటాయించడం అన్యాయమని అన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయింపులా? : ఇళ్ల నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టగా, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు, పైరవీకారులకు ఇష్టారాజ్యంగా కేటాయింపులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. భూములు త్యాగం చేసిన బాధితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, వాటిని విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం ఇళ్లను పంచుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ నాయకులు, పైరవీకారులకు జరిగిన అక్రమ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలి.
భూములు ఇచ్చిన బాధిత కుటుంబాలకే తొలి ప్రాధాన్యతతో ఇళ్లను కేటాయించాలి.
ప్రభుత్వం స్పందించకపోతే ఆర్టీఐ ద్వారా లబ్ధిదారుల జాబితాను సేకరించి ప్రజల ముందుకు తీసుకొస్తామని హెచ్చరించారు.

పోరాటం కొనసాగిస్తాం : ఖైరతాబాద్‌లో భూకబ్జాలు, అక్రమాలకు ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న శ్రవణ్ దాసోజు, పేదల హక్కులను కాలరాస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *