కేటీఆర్ పుట్టినరోజు కాదు.. విద్యార్థి, నిరుద్యోగుల పోరాట దినం: డా. శ్రవణ్ దాసోజు

హైదరాబాద్, జులై 23: కేటీఆర్ 50వ జన్మదినాన్ని వేడుకగా కాకుండా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాట దినంగా నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్ణయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు తెలిపారు. జులై 24న ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే మహా నిరసన దీక్షలో కేటీఆర్ స్వయంగా పాల్గొంటారని చెప్పారు. గురువారం తెలంగాణ భవన్లో శాసనసభ విప్ కె.పీ. వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
వేడుకలు కాదు.. సమరభేరి
“ఇది పుట్టినరోజు వేడుకలు చేసుకునే సమయం కాదు.. పోరాడాల్సిన సమయం” అనే సందేశాన్ని కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఇచ్చారని డా. శ్రవణ్ తెలిపారు. ఢిల్లీలో నీట్ అక్రమాలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా, తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులకు సంఘీభావంగా ఈ నిరసన దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు.
హామీలు అమలు కాలేదు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి హామీలు అమలు కాలేదని డా. శ్రవణ్ ఆరోపించారు. ఖాళీలు వేలల్లో ఉన్నప్పటికీ పరిమిత నియామకాలతో ప్రభుత్వం యువతను మోసం చేసిందని విమర్శించారు.
గ్రూప్-1పై విమర్శలు
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఆరోపణలు చేసినట్లే, తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల అక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాధ్యత వహించాలని డా. శ్రవణ్ అన్నారు. గ్రూప్-1 నిర్వహణలో పారదర్శకత లేదని హైకోర్టు వ్యాఖ్యానించినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.
రాహుల్‌కు ప్రశ్న
ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీకి అమిత్ షా రాజీనామా కోరిన రాహుల్ గాంధీ, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో నిరుద్యోగులపై జరిగిన లాఠీచార్జీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
డిమాండ్లు
నీట్ లీకేజీ, విద్యార్థులపై దాడులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 అక్రమాలు, లాఠీచార్జీలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కోరారు. అలాగే 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పోరాటానికి పిలుపు
జులై 24న ఇందిరా పార్క్‌లో జరిగే మహా నిరసన దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని డా. శ్రవణ్ దాసోజు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శాసనసభ విప్ కె.పీ. వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పాల్గొన్నారు.