వాణిజ్య పన్నుల శాఖలో ఖాళీల భర్తీకి విజ్ఞప్తి

ఏసీటీఓ పోస్టుల్లో వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి

హైదరాబాద్, జూలై 23: తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (డీఆర్) కింద ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ) పోస్టులను అదే శాఖలో పనిచేస్తున్న ప్రమోటి సీనియర్ అసిస్టెంట్లతో వెంటనే భర్తీ చేసి, వారికి ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. రఘునందన్ రావులకు సంఘం తరఫున వినతిపత్రం పంపినట్లు ఆయన తెలిపారు.

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాఖలో సీనియర్ అసిస్టెంట్లుగా దాదాపు ఎనిమిదేళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుస్తున్న వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాల్లో శాశ్వత భవనాలు నిర్మించాలని సూచించారు.

ఉత్తర తెలంగాణ పరిధిలోని కొన్ని సీటీఓ కార్యాలయాల పరిపాలనా అవసరాల దృష్ట్యా ఖమ్మంలో జాయింట్ కమిషనర్ పోస్టును వెంటనే మంజూరు చేయాలని, కాలేశ్వరం జోన్‌కు సంబంధించిన కార్యాలయాలు ప్రస్తుతం ఇతర జాయింట్ కమిషనర్ పరిధిలో కొనసాగుతున్నందున రామగుండంలో జాయింట్ కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీనివల్ల ప్రభుత్వానికి మరింత రెవెన్యూ సమకూరే అవకాశం ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు ఐదు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి, 2004కు ముందు అమల్లో ఉన్న పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులు జమ చేసిన జీపీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్ బిల్లులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని, జీవో నంబర్ 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా జీవో 190 ప్రకారం డిప్యూటేషన్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే, 2024 నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్‌ను ఏకమొత్తంలో చెల్లించడంలో జాప్యం కారణంగా పలువురు పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు మరణించారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండి బిక్షపతి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్, జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్, ఉద్యోగ సంఘం నాయకులు హరిచరణ్, జగన్మోహన్ రెడ్డి, శ్రీకాంత్, ఈశ్వర్, సాగర్, శివరామకృష్ణ, అనూష, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *