హైడ్రాపై హైకోర్టు కొరడా.. రేవంత్ నిరంకుశ పాలనకు చెంపపెట్టు: శ్రవణ్ దాసోజు

హైడ్రాపై హైకోర్టు కొరడా.. రేవంత్ నిరంకుశ పాలనకు చెంపపెట్టు: శ్రవణ్ దాసోజు

హైదరాబాద్, జూలై 28 (విశ్వం న్యూస్): హైడ్రా కమిషనర్‌ను బాధ్యతల నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న “బుల్డోజర్ రాజ్యాంగం”పై న్యాయవ్యవస్థ జరిపిన సర్జికల్ స్ట్రైక్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ తీర్పు రేవంత్ రెడ్డి అహంకార, నిరంకుశ పాలనకు చెంపపెట్టు అని విమర్శించారు.

హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ కేవలం నిమిత్తమాత్రుడేనని, ఆయన వెనుక సూత్రధారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించారని ఆరోపించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఇచ్చిన అక్రమ ఆదేశాలను అమలు చేస్తూ చట్టాన్ని ఉల్లంఘించారని విమర్శించారు. పేదల జీవితాలతో చెలగాటమాడిన విషయంలో “తోలుబొమ్మ రంగనాథ్ అయితే, ఆడించేటోడు రేవంత్ రెడ్డి.. వీరిద్దరూ ముమ్మాటికీ నేరస్తులే” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హైకోర్టు తీర్పు ఒక అధికారిపై వచ్చిన వ్యాఖ్యలకు మాత్రమే పరిమితం కాదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న బుల్డోజర్ పాలనపై న్యాయవ్యవస్థ విధించిన గట్టి హెచ్చరిక అని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చివేస్తూ ముఖ్యమంత్రి సాడిస్టిక్ ఆనందం పొందారని ఆరోపించిన ఆయన, కొంచెమైనా నైతిక బాధ్యత ఉంటే ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

హైడ్రా ఒక వినాశకరమైన, అప్రజాస్వామిక వ్యవస్థ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే హెచ్చరించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను రద్దు చేస్తామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు హైకోర్టు తీర్పు సమర్థించిందని అన్నారు.

హైడ్రా చర్యలు పేదలు, మధ్యతరగతి ప్రజలపై మాత్రమే కొనసాగాయని, అధికార పార్టీలోని నేతల ఆస్తుల విషయంలో మాత్రం మౌనం పాటించిందని ఆరోపించారు. కష్టపడి ఇళ్లు నిర్మించుకున్న పేదలు, చిన్న ఉద్యోగులే హైడ్రా చర్యలకు బలయ్యారని విమర్శించారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం, బాధితులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

హైకోర్టు ఆదేశాల అనంతరం కూడా హైడ్రా కమిషనర్ మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేయడం కోర్టు దిక్కరణ కిందకే వస్తుందని శ్రవణ్ దాసోజు పేర్కొన్నారు. ఒక ఐపీఎస్ అధికారి హైకోర్టును వేలెత్తి చూపే విధంగా మాట్లాడటం వెనుక రాజకీయ అండ ఉందని ఆరోపించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే చట్టాన్ని ఉల్లంఘిస్తే సామాన్య ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాలుగు ప్రధాన డిమాండ్లను ప్రకటించింది. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని, చట్టవిరుద్ధ కూల్చివేతల వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లించాలని, హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని, హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం పైకోర్టులకు వెళ్లకుండా ఆదేశాలను గౌరవించి అమలు చేయాలని డిమాండ్ చేసింది.

రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారని, కానీ రాజ్యాంగం శాశ్వతమని పేర్కొన్న డాక్టర్ శ్రవణ్ దాసోజు, చట్టవిరుద్ధ ఆదేశాలను అమలు చేస్తున్న అధికారులందరి చర్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమీక్షించి, అవసరమైతే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *