ప్రభుత్వ కళాశాలల్లో సర్టిఫికెట్ల నిలిపివేతపై ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్, జూలై 29 (విశ్వం న్యూస్):రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థుల భవిష్యత్తును బందీగా మారుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల కారణంగా వేలాది మంది విద్యార్థులు తమ విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని సాకుగా చూపుతూ నిజాం కాలేజీ, కోటి మహిళా కళాశాల, సైఫాబాద్ సైన్స్ కాలేజీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీతో పాటు పలు ప్రభుత్వ, అటానమస్ కళాశాలలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం అత్యంత దారుణమని ఆయన విమర్శించారు. ప్రభుత్వ కళాశాలలే విద్యార్థులను బ్లాక్‌మెయిల్ చేస్తూ ఫీజుల కోసం వేధించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

విద్యార్థులపై అక్రమ ఒత్తిళ్లు : ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిల కోసం కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వంపై పోరాటం చేయాల్సింది పోయి, అమాయక విద్యార్థులపై ప్రతాపం చూపుతున్నాయని డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆరోపించారు. కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు టీసీ, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలను ఇవ్వకుండా బలవంతంగా ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.

కోర్టు తీర్పులను వక్రీకరిస్తున్నారు : తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కళాశాలలు తమకు అనుకూలంగా వక్రీకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం డీబీటీ ద్వారా ఫీజులు జమ చేయడంలో విఫలమైన ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విద్యార్థుల నుంచి ఫీజులు స్వీకరించే అవకాశం ఉంటుందని కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. అయితే ఎలాంటి పరిస్థితులు లేకుండానే విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడం చట్టవిరుద్ధమని అన్నారు. అంతేకాకుండా ఫీజుల కోసం సర్టిఫికెట్లను నిలిపివేయాలని కోర్టు ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు.

సర్టిఫికెట్లు విద్యార్థుల వ్యక్తిగత ఆస్తి : టీసీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్, మార్కుల మెమోలు విద్యార్థుల వ్యక్తిగత ఆస్తులని, వాటిని తాకట్టు పెట్టుకునే హక్కు ఏ విద్యాసంస్థకీ లేదని డాక్టర్ శ్రవణ్ దాసోజు పేర్కొన్నారు. సర్టిఫికెట్లను నిలిపివేయడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం కూడా పెండింగ్ ఫీజుల పేరుతో ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపివేయడం నేరమని వెల్లడించారు.

పేద విద్యార్థులే బలవుతున్నారు : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఆధారపడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు అందకపోవడంతో పలువురు విద్యార్థులు పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలను కోల్పోతుండగా, ఉద్యోగాల్లో ఎంపికైన విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొంతమంది విద్యార్థుల నుంచి టీసీల కోసం కూడా వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

  • ప్రభుత్వం ముందుకు బీఆర్ఎస్ నాలుగు ప్రధాన డిమాండ్లు :
    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో సంబంధం లేకుండా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను తక్షణమే విద్యార్థులకు అందజేయాలి.
    విద్యార్థులను వేధిస్తున్న కళాశాలల ప్రిన్సిపాళ్లపై విచారణ జరిపి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
    విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి, వాటి చెల్లింపుకు కాలపరిమితితో కూడిన షెడ్యూల్ ప్రకటించాలి.
    సర్టిఫికెట్ల నిలిపివేత, ఫీజుల పేరిట వేధింపులపై విద్యార్థుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ గ్రీవెన్స్ రెడ్రెసల్ సెల్‌ను ఏర్పాటు చేయాలి.

ప్రభుత్వానికి హెచ్చరిక : ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది ప్రభుత్వం మరియు విద్యాసంస్థల మధ్య పరిపాలనా అంశమని, అందులో జరిగిన జాప్యానికి విద్యార్థులను శిక్షించడం క్షమించరాని చర్య అని డాక్టర్ శ్రవణ్ దాసోజు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకుని సర్టిఫికెట్లను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల తరఫున బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.

ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మరియు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు కూడా విజ్ఞప్తి పత్రాలను పంపినట్లు ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *