యూపీఐపై ఛార్జీలు లేవు

- భారతీయ యూజర్లకు ఫోన్‌పే సేవలు ఎప్పటికీ ఉచితం
న్యూఢిల్లీ, ఆగస్టు 8 (విశ్వం న్యూస్) : యూపీఐ లావాదేవీలపై భారతీయ వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో యూపీఐ సేవలపై ఛార్జీలు విధిస్తారన్న చర్చలకు ఆయన ప్రకటనతో తెరపడింది.

భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయని సమీర్ నిగమ్ వెల్లడించారు. యూపీఐ వ్యవస్థ సామాన్య ప్రజలకు సులభమైన, వేగవంతమైన చెల్లింపు మార్గంగా మారిందని, దీనిని మరింత విస్తరించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫోన్‌పే ద్వారా ప్రతిరోజూ కోట్లాది మంది వినియోగదారులు డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఈవో ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.