ఎంవీఎస్‌ఆర్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి: దాసోజు శ్రవణ్

ఎంవీఎస్‌ఆర్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి: దాసోజు శ్రవణ్

విశ్వం న్యూస్ / హైదరాబాద్, అక్టోబర్ 18 : రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో విద్యార్థిని సోనీ మృతి చెందగా, మరో విద్యార్థిని మీనా తీవ్రంగా గాయపడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల అమలులో లోపాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. విద్యాసంస్థల్లో భారీ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన అనుమతులు, అగ్నిమాపక భద్రత, జనసమూహ నియంత్రణ, అత్యవసర వైద్య సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

మృతురాలు సోనీ కుటుంబానికి, తీవ్రంగా గాయపడిన మీనా కుటుంబానికి కళాశాల యాజమాన్యం నుంచి రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మీనాకు కార్పొరేట్ ఆసుపత్రిలో పూర్తి ఉచిత వైద్యం అందించాలని, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.

ఈ ఘటనకు బాధ్యులైన కళాశాల యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాల గుర్తింపును రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఘటనకు దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, కార్పొరేట్ విద్యాసంస్థల నిర్లక్ష్యంపై కఠినంగా వ్యవహరించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని దాసోజు శ్రవణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *