వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
వైభవంగా సద్దుల
బతుకమ్మ వేడుకలు

తిమ్మాపూర్, అక్టోబర్ 18: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు తిమ్మాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం వైభవంగా జరిగాయి. ‘ఒక్కేసి పువ్వేసి చందమామా’ అంటూ మహిళలు, ఆడబిడ్డలు బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, కోలాటాలతో సందడి చేశారు.
ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు చివరి రోజైన సద్దుల బతుకమ్మతో ఘనంగా ముగిశాయి. మహిళలు వివిధ రకాల ప్రకృతి సిద్ధమైన పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పసుపుతో గౌరీదేవిని తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహికంగా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడి, నృత్యాలు చేస్తూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు.

సద్దుల బతుకమ్మ సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల సద్దులను నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మలను సమీపంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి వేడుకలను ముగించారు.
మండలంలోని పల్లెలు, పట్టణ ప్రాంతాలు పూల సోయగాలతో కళకళలాడాయి. మహిళల ఆటపాటలు, ఆనందోత్సాహాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతితో మమేకమైన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రజల్లో ఐక్యతను, సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని చాటిచెప్పింది.