తెలంగాణ ఆత్మపై అహంకార దాడి:ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్

- రేవంత్ రెడ్డి గారూ.. మీరు తెలంగాణ ముఖ్యమంత్రా? లేక ఫ్యాక్షన్ ముఠా నాయకుడా?
- సీఎం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఘాటు విమర్శలు
హైదరాబాద్, జనవరి 19, 2026 (విశ్వం న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న అప్రజాస్వామిక ధోరణి, ఆయన ప్రసంగాల్లో వినిపిస్తున్న హింసాత్మక పదజాలంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల చేస్తూ, రేవంత్ రెడ్డి ప్రవర్తన ముఖ్యమంత్రి స్థాయికి ఏమాత్రం తగ్గదని తీవ్రంగా విమర్శించారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి ‘పాతిపెట్టండి’, ‘బొంద పెట్టండి’, ‘దిమ్మలు కూల్చండి’ వంటి పదాలను వాడటం చూస్తుంటే, మీరు ప్రజాస్వామ్య నాయకుడిలా కాకుండా ఒక ఫ్యాక్షన్ ముఠా నాయకుడిలా వ్యవహరిస్తున్నట్టు ఉందని శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, సమాజంలో ద్వేషాన్ని రెచ్చగొట్టే ఒక రకమైన నేరపూరిత కుట్ర (Criminal Conspiracy)గా అభివర్ణించారు.
కాంగ్రెస్ జెండా – టీడీపీ అజెండా
రేవంత్ రెడ్డి రాజకీయ తీరుపై విస్మయం వ్యక్తం చేసిన శ్రవణ్, “అధికారం కాంగ్రెసే కానీ, ఆత్మ మాత్రం టీడీపీదే” అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జెండాను కప్పుకుని, లోపల మాత్రం తన పాత యజమాని చంద్రబాబు నాయుడి అజెండాను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ‘ప్లాన్–బి’లో భాగంగా టీడీపీని మళ్లీ లేపేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది రాజకీయ వ్యభిచారానికి నిదర్శనమని మండిపడ్డారు.
సొంత పార్టీ సీనియర్ నేతల అణిచివేత
కాంగ్రెస్ పార్టీని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారిని క్రమపద్ధతిలో బలహీనపరుస్తున్నారని శ్రవణ్ దాసోజు ఆరోపించారు. ఒకవైపు ఢిల్లీ అధిష్టానానికి నమ్మకద్రోహం చేస్తూ, మరోవైపు టీడీపీ, బీజేపీలతో కోవర్ట్ సంబంధాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు.
ఆర్థిక అజ్ఞానం – డొల్ల వాగ్దానాలు
రాష్ట్రం ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పటికీ, సంపద సృష్టించే స్పష్టమైన ప్రణాళిక లేకుండా ‘ఫ్యూచర్ సిటీ’, ‘5 ట్రిలియన్ ఎకానమీ’ అంటూ ప్రజలకు కలలు చూపిస్తున్నారని శ్రవణ్ ఎద్దేవా చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు కనీస ప్రయోజనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.
కేసీఆర్ – తెలంగాణ జాతిపిత
తెలంగాణ సాధన కోసం సర్వస్వం త్యాగం చేసిన కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ‘తెలంగాణ జాతిపిత’గా శాశ్వతంగా నిలిచిపోతారని శ్రవణ్ స్పష్టం చేశారు. అటువంటి మహనీయుడిని, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర్ఎస్ పార్టీని తూలనాడటం సూర్యుడిపై ఉమ్మి వేసినట్టేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“అధికారం శాశ్వతం కాదు. మీ అహంకారమే మీ రాజకీయ వినాశనానికి దారితీస్తుంది” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు హితవు పలికారు.