పసునూర్ మోడల్ స్కూల్లో రోడ్డు భద్రతపై అవగాహన

పసునూర్ మోడల్ స్కూల్లో
రోడ్డు భద్రతపై అవగాహన

నాగారం, జనవరి 19 (విశ్వం న్యూస్) : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా నాగారం మండల పరిధిలోని పసునూర్ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో సోమవారం జాతీయ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగారం మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్, వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగారం మండల సబ్ ఇన్‌స్పెక్టర్ చిరంజీవి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, అందరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని తెలిపారు. అలాగే ఆటోల్లో పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించకూడదని, కారు ప్రయాణంలో సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా 18 సంవత్సరాలు నిండకముందే వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు లేదా వాహనం ఇచ్చిన వారికే బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సుమారు 80 శాతం మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సూర్యాపేట పోలీస్ శాఖ కళాబృందం ఎల్లన్న మరియు బృందం తమ పాటల ద్వారా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బల్గూరి చంద్రబాబు, పసునూర్ గ్రామ సర్పంచ్ కమటం సునిత శ్రీను, మాజీ ఎంపీటీసీ కమటం మంజుల, పోలీస్ కానిస్టేబుల్స్ సిహెచ్ శ్రీనివాస్, కిరణ్, దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *