మంత్రిగా అజారుద్దీన్

హైదరాబాద్, అక్టోబర్ 31 (విశ్వం న్యూస్): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ తెలంగాణ కేబినెట్‌లోకి ఎట్టకేలకు ప్రవేశించారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనూహ్య పరిణామాల నడుమ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యూహాత్మక నిర్ణయం తీసుకొని అజారుద్దీన్‌కి మంత్రి పదవి కేటాయించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ మైనార్టీ ఓటర్ల ప్రభావం గెలుపు–ఓటములను నిర్ణయించగల స్థాయిలో ఉండటంతో అజారుద్దీన్‌ను మంత్రిగా చేయడం రాజకీయంగా లాభదాయకంగా భావిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఓడిపోయిన అజారుద్దీన్‌కు గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తాజాగా మంత్రివర్గంలో చోటు లభించడం ఆయనకు మరో పెద్ద గుర్తింపు. రేవంత్ త్వరలోనే శాఖల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో కొందరు మంత్రుల పోర్ట్‌ఫోలియోలలో మార్పులు సంభవించే అవకాశం ఉన్నట్లు సమాచారం.