టిమ్స్‌లో మెడికల్ టూరిజం ప్రతిపాదనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ఫైర్

హైదరాబాద్, జూన్ 13 (విశ్వం న్యూస్) : తెలంగాణలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవల కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మెడికల్ టూరిజంపై దృష్టి కేంద్రీకరించడం ఆందోళన కలిగిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ విమర్శించారు.

ప్రపంచస్థాయి వైద్య సేవలను తెలంగాణ ప్రజలకు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన టిమ్స్ సనత్‌నగర్ ఆసుపత్రిని కార్పొరేట్ వ్యాపార కేంద్రంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం G.O.Rt.No.178 ద్వారా కమిటీ ఏర్పాటు చేయడం ప్రజా వైద్య రంగాన్ని వ్యాపార దృక్పథంతో చూడటానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు, వైద్య సిబ్బంది, పరికరాల కొరత వంటి సమస్యలు ఇంకా కొనసాగుతుండగానే విదేశీ రోగులను ఆకర్షించేందుకు ప్రత్యేక బ్లాక్‌లు, ప్యాకేజీలు, మార్కెటింగ్ కార్యక్రమాలు చేపట్టడం ప్రజల అవసరాలను విస్మరించిన చర్యగా కనిపిస్తోందని అన్నారు.

ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన ఆసుపత్రులను ముందుగా తెలంగాణ ప్రజల అవసరాలకు పూర్తిస్థాయిలో వినియోగించాలని, స్థానిక ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాతే మెడికల్ టూరిజం వంటి అంశాలపై ఆలోచించాలని డా. దాసోజు శ్రవణ్ అభిప్రాయపడ్డారు.

“తెలంగాణ ప్రజలు వైద్యం కోసం క్యూల్లో నిలబడుతుంటే, ప్రభుత్వం మాత్రం విదేశీ రోగుల కోసం రెడ్ కార్పెట్ పరచడం సమంజసం కాదు. ప్రజల ఆరోగ్య హక్కులను పక్కనబెట్టి డాలర్ల ఆదాయం కోసం పరుగులు తీయడం తెలంగాణ ఆత్మకు విరుద్ధం” అని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ప్రభుత్వ వైద్య రంగ బలోపేతంపైనే పూర్తి దృష్టి సారించాలని డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *