
హైదరాబాద్, జూన్ 14 (విశ్వం న్యూస్) : మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ అధిష్టానం అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. రాజ్యసభకు మీనాక్షిని పంపించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా, సుప్రీంకోర్టులోనూ ఆశించిన ఉపశమనం లభించలేదు. దీంతో ఆమెను మరో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించే అవకాశాలను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా భావించే మీనాక్షి నటరాజన్‌కు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరిగినట్లు ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరఫున అనిల్ కుమార్ యాదవ్, వేమ్ నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ, రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరున్న వేమ్ నరేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి, ఆ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభకు పంపే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వేమ్ నరేందర్ రెడ్డి ఈ ఏడాది మార్చిలో తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ఏప్రిల్ 16న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అనూహ్యంగా కొద్ది నెలల్లోనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందా అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
మీనాక్షి కోసం నిజంగానే తెలంగాణ రాజ్యసభ సీటు ఖాళీ అవుతుందా? లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమేనా? అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది. అయితే ఈ పరిణామం కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసిందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.