ప్రాణాన్ని బలిగొన్న
బంగీ జంప్ సరదా..!

హైదరాబాద్, జూన్ 14 (విశ్వం న్యూస్): అడ్వెంచర్ క్రీడల్లో భద్రతా లోపాలు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో బ్రెజిల్‌లో జరిగిన ఘటన మరోసారి రుజువు చేసింది. బంగీ జంప్ సరదా కోసం వెళ్లిన 21 ఏళ్ల యువతి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
బ్రెజిల్‌లోని లైమీరా ప్రాంతంలో శనివారం జరిగిన ఈ ప్రమాదంలో గ్రేటర్ సావో పాలోకు చెందిన మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ (21) మృతి చెందింది. స్నేహితులతో కలిసి అడ్వెంచర్ గేమ్స్‌లో పాల్గొనడానికి వెళ్లిన ఆమె అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి స్వింగ్ జంప్‌కు సిద్ధమైంది.
అయితే, జంప్‌కు ముందు యువతి కాళ్లకు భద్రతా తాడు కట్టాల్సిన సిబ్బంది కీలకమైన ఆ ప్రక్రియను మరిచిపోయారు. ఈ విషయాన్ని గమనించకుండానే ఆమెను సుమారు 40 మీటర్ల ఎత్తు నుంచి కిందకు తోశారు. ఫలితంగా గాల్లో ఊగాల్సిన ఆమె నేరుగా నేలను ఢీకొని తీవ్రంగా గాయపడింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
యువతి కిందపడుతున్న సమయంలో చేసిన ఆర్తనాదంతోనే సిబ్బందికి అసలు విషయం అర్థమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలో సేఫ్టీ రోప్ కట్టకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణంగా గుర్తించిన పోలీసులు ఘటనకు బాధ్యులైన ఆరుగురు సిబ్బందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.