ప్రశ్నిస్తే దాడులా? ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన?
- బావార్చి బిర్యానీ నిరసనతో నిరుద్యోగుల హామీలను గుర్తుచేస్తే దాడులు చేయిస్తారా?
- రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ బహిరంగ సవాల్
విశ్వం న్యూస్, హైదరాబాద్, నవంబర్ 27: చేతిలో రాజ్యాంగం పట్టుకుని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు, మరోవైపు శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై దాడులు చేయించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగుల సమస్యలను గుర్తుచేస్తూ బీఆర్ఎస్ యువనేతలు చేపట్టిన వ్యంగ్య నిరసనపై ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.
శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ యువనేతలు మన్నె క్రిశాంక్, జగన్, దినేష్, విష్ణు, హరీష్‌లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్ల క్రితం అశోక్‌నగర్‌కు వచ్చిన రాహుల్ గాంధీ, బావార్చి రెస్టారెంట్లో బిర్యానీ తింటూ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన శ్రవణ్.. నేటికీ వాటి అమలు కోసం యువత ఎదురుచూస్తోందని అన్నారు.
రాహుల్ గాంధీ చిత్రపటాన్ని కూర్చోబెట్టి బిర్యానీ తినిపిస్తూ నిరసన తెలపడం సృజనాత్మక ప్రజాస్వామ్య నిరసన మాత్రమేనని, ఎవరినీ అవమానించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు దాడికి దిగారని, ఈ ఘటనలో దినేష్‌కు గాయాలయ్యాయని ఆరోపించారు.
యువతకు ఇచ్చిన హామీలేవి? : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జూన్ 2న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని యూత్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారని శ్రవణ్ గుర్తుచేశారు. మూడేళ్లు గడిచినా హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ప్రభుత్వ రాయితీలు పొందుతున్న ప్రైవేట్ సంస్థల్లో తెలంగాణ యువతకు 75 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం లేకుండా అమలు చేయగల ఈ హామీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని నిలదీశారు.
విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం : టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని చెప్పి, జీవో 29, జీవో 46తో నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఆరోపించారు. గ్రూప్-1 నియామకాల్లోనూ అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.15 వేల కోట్లకు చేరడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షన్లు, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, యువతకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు, మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఏడు జోన్లలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. యూత్ కమిషన్ ఏర్పాటు, ఇతర ఉపాధి హామీల అమలుపైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌కు బహిరంగ సవాల్ : ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చేపట్టే నిరసనలు ప్రజాస్వామ్యబద్ధమైనవిగా కనిపిస్తుంటే, హైదరాబాద్‌లో నిరుద్యోగుల తరఫున శాంతియుతంగా ప్రశ్నిస్తే దాడులు చేయించడం ఏ విధమైన ప్రజాస్వామ్యమని శ్రవణ్ ప్రశ్నించారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోందా? లేక అనుముల రాజ్యాంగం నడుస్తోందా? అని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ సవాల్ విసురుతూ.. బావార్చి రెస్టారెంట్‌కు రావాలని, తాను కూడా వస్తానని, ఎదురెదురుగా కూర్చుని బిర్యానీ తింటూనే ఉద్యోగాలు, యూత్ డిక్లరేషన్ హామీలపై చర్చిద్దామని అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం ఆగదని, దాడులు, కేసులతో ఉద్యమాన్ని అణచివేయలేరని స్పష్టం చేశారు
