Today TrendingVishwam Newsహైదరాబాద్

విప్రో వాక్‌-ఇన్స్‌కు భారీ స్పందన.. వామ్మో ఇంత మందా! (వీడియో)

  • హైదరాబాద్‌లో రోడ్డుపై బారులు తీరిన నిరుద్యోగులు.. వైరల్‌గా మారిన వీడియో

విశ్వం న్యూస్, హైదరాబాద్, 27 నవంబర్ 2026 : ప్రముఖ ఐటీ సంస్థ విప్రో నిర్వహించిన వాక్‌-ఇన్ ఇంటర్వ్యూకు భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. కంపెనీ ప్రవేశ ద్వారం నుంచి రోడ్డు పొడవునా వందలాది మంది నిరుద్యోగ యువత బారులు తీరిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో దేశంలో నిరుద్యోగం, ఐటీ ఉద్యోగాల కోసం నెలకొన్న తీవ్ర పోటీపై మరోసారి చర్చకు తెరలేపింది.

ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాల కోసం ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు రావడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉద్యోగాల కోసం యువత పడుతున్న కష్టాలను ఈ దృశ్యాలు ప్రతిబింబిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, ఆన్‌లైన్‌లోనే అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, వందలాది మందిని నేరుగా పిలిచి గంటల తరబడి వేచి ఉండేలా చేయడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. బీటెక్, ఐటీ విద్యే ఉద్యోగాలకు ఏకైక మార్గమనే భావన నుంచి యువత బయటకు రావాలని మరికొందరు సూచిస్తున్నారు.

అయితే, దేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పెరగకపోవడం, ఏటా వేలాది మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్లోకి రావడం, అందుబాటులో ఉన్న కొలువుల కోసం తీవ్ర పోటీ నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. డిగ్రీలు ఉన్నంత మాత్రాన ఉద్యోగం దక్కుతుందనే పరిస్థితి లేదని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోందని నెటిజన్లు చర్చిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *