కటకటాలకు బండి భగీరథ్!

  • టీజీపీఏ వద్ద అరెస్టు.. 14 రోజుల రిమాండ్‌తో చర్లపల్లి జైలుకు తరలింపు

హైదరాబాద్, మే 17విశ్వం న్యూస్) : హైదరాబాద్‌లో సంచలనం రేపిన కేసులో బండి భగీరథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచే హైడ్రామా నడుమ చివరకు ఆయనను టీజీపీఏ కార్యాలయం వద్ద పోలీసులు అరెస్టు చేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం డీసీపీ ఎదుట రెండున్నర గంటల పాటు విచారణ నిర్వహించిన పోలీసులు, కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.

లుకౌట్ నోటీసులతో ఉత్కంఠ : భగీరథ్ పరారయ్యే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు ముందుగానే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎయిర్‌పోర్టులో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. చివరకు న్యాయవాదుల సమక్షంలో ఆయన లొంగిపోవడంతో పోలీసులు అరెస్టు ప్రక్రియ పూర్తి చేశారు.

బాధితురాలి వాంగ్మూలం నమోదు : ఇక ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేసినట్లు తెలిసింది. మరోవైపు ఫోన్ డేటా, కాల్ రికార్డులు, డిజిటల్ ఆధారాలను సేకరిస్తూ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసులో మరికొంతమంది పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

14 రోజుల రిమాండ్ : విచారణ అనంతరం భగీరథ్‌ను కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *