ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థి ఉద్యమ విజయమే: దాసోజు

హైదరాబాద్, జూలై 25 (విశ్వం న్యూస్) : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమానికి లభించిన విజయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. అధికార అహంకారం, అధిపత్య ధోరణులు ఎంత బలంగా ఉన్నా ప్రజాస్వామ్యంలో సమిష్టి విద్యార్థి చైతన్యం ముందు తలవంచక తప్పదని ఆయన అన్నారు. యువత ప్రశ్నించే గొంతుకను ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయలేదని స్పష్టం చేశారు.
యువశక్తి విజయానికి నిదర్శనం : విద్యార్థులు, యువత ఐక్యంగా పోరాటం చేస్తే ఎలాంటి అధికార పీఠమైనా కదలాల్సిందేనని దాసోజు శ్రవణ్ అన్నారు. పాలనలో జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తే యువత చూస్తూ ఊరుకోదని, ఈ పరిణామం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
అహంకార పాలనకు గట్టి హెచ్చరిక : అధిపత్య అహంకార ధోరణులకు కాలం చెల్లిందని ఈ రాజీనామా స్పష్టం చేసిందని ఆయన అన్నారు. విద్యార్థుల సమస్యలను సకాలంలో పరిష్కరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, వారి ఆవేదనను నిర్లక్ష్యం చేసిన ఫలితమే ఈ పరాభవమని విమర్శించారు.
నాలెడ్జ్ పవర్ ముందు నియంతృత్వం నిలవదు : నేటి యువత చట్టాలు, హక్కులు, తమ భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతో ఉందని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. చదువుకున్న యువత సమాజం రోడ్డెక్కితే ఎలాంటి అహంకార పాలనైనా దిగిరాక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు : ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడడం మానుకోవాలని ఆయన సూచించారు. విద్యా వ్యవస్థలో పూర్తి పారదర్శకత, నిజాయితీ నెలకొనే వరకు విద్యార్థి ఉద్యమ చైతన్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
చివరగా, “ఇది ముగింపు కాదు. విద్యార్థుల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుంది. జై విద్యార్థి ఐక్యత.. జై యువశక్తి!” అని దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు.