ప్రభుత్వ భూమి ప్రైవేట్ ఏటీఎంలా మారింది!
- కంచ గచ్చిబౌలి తనఖాపై సీబీఐ విచారణ జరపాలి: ఫ్యాబ్ సిటీ తీర్పును స్వాగతించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్
విశ్వం న్యూస్, హైదరాబాద్, నవంబర్ 28 : ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు, బడా వ్యాపారులు బ్యాంకు రుణాలకు తనఖా పెట్టుకోవడం వెనుక ప్రభుత్వాలు, బ్యాంకులు, ఆశ్రిత పెట్టుబడిదారుల కుమ్మక్కు ఉందని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఫ్యాబ్ సిటీ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించిన తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వ భూముల పరిరక్షణపై మరోసారి చర్చకు తెరలేపాయని పేర్కొంది. ప్రజల ఆస్తులను ప్రైవేట్ సంస్థల రుణాలకు పూచీకత్తుగా ఉపయోగించడం ఆందోళనకరమని విమర్శించింది.
రూ.640 కోట్లకు చేరిన రుణ బకాయిలు : 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రావిర్యాల ఫ్యాబ్ సిటీలోని 100 ఎకరాల భూమిని సెమ్ ఇండియా ఫ్యాబ్ సంస్థకు ఎకరానికి ఏడాదికి కేవలం రూ.1 లీజు చొప్పున 66 ఏళ్లకు కేటాయించారని బీఆర్ఎస్ వివరించింది. పరిశ్రమ స్థాపనలో పురోగతి లేకపోవడంతో 2010 ఫిబ్రవరిలో 78 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తెలిపింది. అయితే 2011 ఆగస్టులో అదే భూమిని తనఖాగా స్వీకరించి ఎస్బీఐ సుమారు రూ.500 కోట్ల రుణం మంజూరు చేసిందని, ప్రస్తుతం ఆ బకాయిలు రూ.640 కోట్లు దాటాయని ఆరోపించింది. నేటికీ అక్కడ పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభం కాకుండా మొండిగోడల షెడ్డు మాత్రమే కనిపిస్తోందని విమర్శించింది.
ప్రభుత్వ భూముల పరిరక్షణలో బీఆర్ఎస్ చర్యలు : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టులో ఫ్యాబ్ సిటీకి కేటాయించిన 100 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించామని పేర్కొంది. అలాగే 2017-18లో పసిఫిక్ హాస్పిటల్స్ తనఖా పెట్టిన ఐటీ భూమి వేలాన్ని అడ్డుకుని కేటాయింపును రద్దు చేసినట్లు తెలిపింది. పనిచేయని 95 పరిశ్రమల నుంచి 448 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని, మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి భూమిని ఎల్ఐసీ వద్ద రూ.120 కోట్లకు తనఖా పెట్టిన వ్యవహారంపైనా విచారణ చేపట్టామని వివరించింది.
ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా తనఖా పెట్టుకుని రుణాలు పొందే ప్రయత్నాలను అడ్డుకోవాలని బ్యాంకులకు లిఖితపూర్వక హెచ్చరికలు జారీ చేసినట్లు బీఆర్ఎస్ వెల్లడించింది.
కంచ గచ్చిబౌలి భూములపై కొత్త వివాదం : ప్రస్తుతం కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపైనా బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జీవో ద్వారా 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదిలీ చేసి, ప్రభుత్వ గ్యారెంటీతో ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.10,000 కోట్ల రుణం పొందే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది.
ఈ భూములపై టీజీఐఐసీకి పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయా? కేవలం జీవో ఆధారంగానే రుణానికి పూచీకత్తుగా చూపిస్తున్నారా? బ్యాంకు యాజమాన్య హక్కులు, భూమి చట్టబద్ధతను పూర్తిస్థాయిలో పరిశీలించిందా? భవిష్యత్తులో కోర్టు భూమి హోదాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే రుణ భారం ప్రజలపై పడదా? అని ప్రశ్నించింది.
ప్రభుత్వానికి బీఆర్ఎస్ సూటి ప్రశ్నలు : రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములు ఏయే బ్యాంకుల్లో తనఖాలో ఉన్నాయో వెల్లడించాలని డిమాండ్ చేసింది. ఫ్యాబ్ సిటీలో 78 ఎకరాలు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా 2011లో తనఖాకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరో తేల్చాలని, డిసెంబర్ 4న సంబంధిత ఫైళ్లన్నింటినీ హైకోర్టు ముందు ఉంచాలని కోరింది.
కంచ గచ్చిబౌలి రుణ నిబంధనలు, భూమి టైటిల్ పత్రాలు, రుణ చెల్లింపు ప్రణాళికను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేసింది. అలాగే ప్రభుత్వ భూముల విషయంలో గతంలో బీఆర్ఎస్ తీసుకున్న స్వాధీన నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వం కోర్టులో సమర్థిస్తుందా? లేక బ్యాంకులు, ప్రమోటర్లకు మద్దతుగా నిలుస్తుందా? అని నిలదీసింది.
నాలుగు ప్రధాన డిమాండ్లు : 2004 నుంచి ఇప్పటివరకు తనఖా పెట్టిన ప్రభుత్వ భూముల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బ్యాంకులు పరిశీలించుకునేలా ప్రభుత్వ భూకేటాయింపుల పబ్లిక్ రిజిస్టర్ ఏర్పాటు చేయాలని, రుణ మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో ఉంచి నిర్మాణ పురోగతికి అనుగుణంగా విడుదల చేసే విధానం తీసుకురావాలని సూచించింది. ఫ్యాబ్ సిటీ వ్యవహారంపై కాలపరిమితితో కూడిన సీబీఐ విచారణ జరిపి, కంచ గచ్చిబౌలి భూముల అంశాన్నీ అదే ప్రమాణాలతో పరిశీలించాలని కోరింది.
ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటిని ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టే హక్కు ఎవరికీ లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. పేద రైతులు, చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చే విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసే బ్యాంకులు, బడా కార్పొరేట్ సంస్థలకు మాత్రం సరైన తనిఖీలు లేకుండా వేల కోట్ల రుణాలు ఇవ్వడం ఏ విధమైన న్యాయమని ప్రశ్నించింది. ఈ వ్యవహారం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి నిదర్శనమని విమర్శించింది.
