రాష్ట్రంలో 582 స్క్రీన్ లలో
గాంధీ చిత్రం ఉచిత ప్రదర్శన

హైదరాబాద్, ఆగస్టు 9 (విశ్వం న్యూస్) : ఈ నెల 14 నుండి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని దియేటర్ లలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో చిత్ర ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకలలో భాగంగానే విద్యార్ధులలో జాతీయ స్పూర్తిని చాటే విధంగా రాష్ట్రంలోని 582 స్క్రీన్ లలో గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు చెప్పారు.
విద్యార్ధులను దియేటర్ ల వద్దకు ఉచితంగా తీసుకొచ్చి, క్షేమంగా వారి గమ్య స్థానాలకు తీసుకెళ్ళే విధంగా థియేటర్ ల నిర్వహకులు, విద్యాశాఖ, రవాణా శాఖ తదితర శాఖలకు చెందిన అధికారులతో సమన్వయం చేసుకొంటూ ఏర్పాట్లు పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.