ప్రకృతి పరిరక్షణకు గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం

ప్రకృతి పరిరక్షణకు గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం

ప్రత్యేక ప్రతినిధి: ప్రకృతి పరిరక్షణలో విశిష్ట సేవలు అందిస్తున్న బీఆర్‌ఎస్ పూర్వ పార్లమెంట్ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించింది. ప్రపంచ ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు ఆయనను వరించింది.

ఈ నెల 17న బ్రిటన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ సభలో ఈ పురస్కారాన్ని ఘనంగా అందజేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులపై విశేష కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి బ్రిటన్‌కు చెందిన “హిలిన్ స్పార్క్ స్ట్రాటజీస్ యూకే లిమిటెడ్” సంస్థ ఈ అవార్డును ప్రదానం చేస్తోంది.

“ఆకుపచ్చగా ఉంటేనే సిరిసంపదలు” అనే నినాదంతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం దేశవ్యాప్తంగా విశేష స్పందన పొందింది. విద్యార్థులు, యువత, సామాజికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖుల భాగస్వామ్యంతో కేవలం ఎనిమిదేళ్లలో 19 కోట్లకు పైగా మొక్కలు నాటించడం ద్వారా పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించింది.

ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు “వృక్ష వేదం-2.0” గ్రంథాన్ని సంతోష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సేవలను రాష్ట్రపతి ప్రశంసించడం విశేషంగా నిలిచింది.

తెలంగాణ హరితహారం స్ఫూర్తితో ప్రకృతి పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న సంతోష్ కుమార్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *