ప్రభుత్వ కళాశాల ప్రచారానికి శ్రీకారం

విశ్వ న్యూస్, కరీంనగర్, మే 3 : కరీంనగర్‌లోని ప్రముఖ ప్రభుత్వ జూనియర్ కళాశాల (సైన్స్ వింగ్) అభివృద్ధి, పూర్వ వైభవం కోసం విస్తృత ప్రచార కార్యక్రమానికి డా. ఎలగందుల శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, వాసుదేవ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
75 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభుత్వ జూనియర్ కళాశాల (సైన్స్ వింగ్) ప్రత్యేకతలు, ప్రాధాన్యతలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వచ్చే విద్యా సంవత్సరంలో కళాశాలలో మరిన్ని అడ్మిషన్లు పెరిగేలా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డా. ఎలగందుల శ్రీనివాస్ స్వంత ఖర్చులతో ప్రచార బ్రోచర్లు ముద్రించి కళాశాల యాజమాన్యానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైన్స్ వింగ్ కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, వివిధ రంగాల ప్రముఖులుగా ఎదిగారని తెలిపారు. కళాశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్న అధ్యాపకులను అభినందించారు.
ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ మంచి ఫలితాలు రావడం, ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులు ర్యాంకులు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొంజర్ల మహేష్, అర్బిందర్ సింగ్, నజియా తదితరులు పాల్గొన్నారు.