జీవహింసకు చెక్.. మహా కరుణ శాఖాహార ర్యాలీ

హైదరాబాద్, మే 3 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ నగరంలోని గంధం గూడ, కేకే-2 కాలనీలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూమెంట్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం మహా కరుణ శాఖాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జీవహింసను అరికట్టాలని, శాఖాహార జీవన విధానాన్ని ప్రతి కుటుంబం ఆచరించాలని ర్యాలీ ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. మహిళలు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని “సేవ్ అనిమల్స్”, “బీ ఎ వెజిటేరియన్”, “ఈట్ వెజ్ లివ్ లాంగ్” వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు.
ర్యాలీ ప్రధాన ఆకర్షణగా ఆధ్యాత్మిక గురువు పిరమిడ్ మాస్టర్ పత్రీజీ గారి బోధనలను ప్రతిబింబించే ఫ్లెక్సీలు, బ్యానర్లు నిలిచాయి. శాంతి, ధ్యానం, శాఖాహారం మానవత్వానికి మార్గమని నిర్వాహకులు పేర్కొన్నారు. జంతు హింసను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి శాఖాహారం ఎంతో దోహదపడుతుందని వివరించారు.
ర్యాలీ అనంతరం ధ్యాన కార్యక్రమం, ఆధ్యాత్మిక సందేశ సభ నిర్వహించారు. చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ప్రాంతీయ ప్రజల నుంచి ర్యాలీకి మంచి స్పందన లభించింది.
