
- బైక్ ను ఢీకొన్న మొరం టిప్పర్
- మొరం మీద పడి అన్నచెల్లి మృతి..
- చికిత్స పొందుతూ అక్క మృతి..

హుజూరాబాద్, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్): మట్టి లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడగా మట్టిలో కూరుకుపోయి అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు, మరో యువతి మృతితో బోర్నపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది.
బోర్నపల్లి గ్రామానికి చెందిన వర్ష (15), గంట విజయ్ (17), గంట సింధూజ (18) గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి జాతరలో పాల్గొన్నారు. జాతర ముగిసిన అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెల్తుండగా.. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామం నుంచి హుజూరాబాద్‌కు మట్టి వస్తున్న ట్రక్కు బోర్నపల్లి మూలమలుపు వద్ద డ్రైవర్ బ్రేక్ వేయడంతో ట్రక్కు అదుపుతప్పింది. అదే సమయంలో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువతీయువకులపై మట్టి పడింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే విజయ్, సింధూజ ఇద్దరు మృతి చెందారు. వర్ష చికిత్స పొందుతూ చనిపోయింది. సమాచారం అందుకున్న మృతుల కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కన్నబిడ్డల మృతదేహాలను చూసి గుండెలవిసేలా విలపించారు. మృతులు విజయ్, వర్ష ఇద్దరు అన్నాచెల్లెళ్లు. సింధూజ వరుసకు అక్క అవుతుందని గ్రామస్తులు చెప్పారు. విజయ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం, వర్ష టెన్త్, సింధూజ డిగ్రీ చదువుతోంది. టిప్పర్ లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.