ఓఆర్ఆర్ లోపల 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం

ఓఆర్ఆర్ లోపల 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం

  • సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మంత్రివర్గం కీలక నిర్ణయం

హైదరాబాద్‌, నవంబర్‌ 25 (విశ్వం న్యూస్) : ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర పరిమితులు, పట్టణ వసతులపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

  • పెద్ద అంబర్ పేట్, జల్‌పల్లి, తుర్కయంజాల్, శంషాబాద్‌లు, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, దమ్మాయి గూడ, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌‌పేట్, బండ్లగూడ జీగీర్, మీర్‌పేట్, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం కాబోతున్నాయి.

ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరిగేలా చేసిన చర్య ఇదేనని మంత్రి వర్గం అభిప్రాయపడింది. ఇప్పటి వరుకు జీహెచ్ఎంసీ పరిధి వెలుపల ఉన్న శివారు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజి, స్ట్రీట్ లైట్లు, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధి అసమానంగా ఉండటంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రివర్గం గుర్తించింది. వీటన్నింటిని ఒకటే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి, ఒకే అభివృద్ధి ప్రమాణం అమలు చేసే అవకాశం లభిస్తుందన్న భావనతో విలీనంపై ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో ఈ మేరకు ఆర్డినెన్స్ విడుదల కానుందని అధికార వర్గాలు సూచించాయి. విలీన ప్రక్రియ పూర్తయిన తరువాత హైదరాబాద్ మహానగరం పరిమాణం, జనాభా, బడ్జెట్, పరిపాలనా విభాగాలు మరింత విస్తరించనున్నాయి.

విలీనంతో నగర పాలన మరింత కేంద్రీకృతమై, అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణపై సంబంధిత మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *