
హైదరాబాద్, జూన్ 1 (విశ్వం న్యూస్): ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హింసాత్మక చర్యలను తక్షణం నిలిపివేయాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. శాంతి చర్చలే శాశ్వత పరిష్కార మార్గమని పార్టీ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు.
శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు శాంతి, చర్చల మార్గాన్ని బీఆర్ఎస్ సమర్థిస్తోందని తెలిపారు. “వరంగల్ మహాసభలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు రావాలని, రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న మారణకాండను నిలిపివేయాలని స్పష్టంగా పేర్కొన్నారు,” అని గుర్తు చేశారు.
డా. శ్రవణ్ మాట్లాడుతూ, ప్రజలు తుపాకీ పట్టే పరిస్థితులు అనేవి హఠాత్తుగా రావని, ఆర్థిక, సామాజిక అసమానతలే దీని ప్రధాన కారణమని పేర్కొన్నారు. “ఎవ్వరూ తుపాకీ పట్టడానికి జన్మించరు. కానీ ఫ్యూడల్ రాజకీయ వ్యవస్థలు, పెట్టుబడిదారుల ఆధిపత్యం, న్యాయం లేని పరిస్థితులు ప్రజలను ఆ దిశగా నెట్టేస్తున్నాయి” అన్నారు.
ప్రజలకు తగిన వేదికలు, అభ్యంతరాలను వ్యక్తపరిచే చట్టబద్ధ మార్గాలు అందుబాటులో ఉండాలని సూచించిన ఆయన, చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమని నమ్మకం వ్యక్తం చేశారు. “తుపాకీ కాదు – చర్చలే మార్గం” అని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలతో సభను ముగించారు.