కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు కాలం చెల్లిందా?
కట్టడి లేకుంటే
కాంగ్రెస్‌కు కష్టకాలమే!

- అదుపులేని నేతల మాటలు.. కాంగ్రెస్‌కు తలనొప్పులు!
- స్వేచ్ఛ పేరుతో కాంగ్రెస్‌లో స్వైర విహారం!
- కట్టడి లేకుంటే కాంగ్రెస్‌కు కష్టకాలమే!
- అంతర్గత ప్రజాస్వామ్యమా.. విచ్చలవిడి వ్యవహారమా?
విశ్వం న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 30: కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఎలా మాట్లాడినా, ఎలా వ్యవహరించినా చెల్లుబాటు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిని కొందరు ఆ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంగా అభివర్ణిస్తుంటే.. మరికొందరు క్రమశిక్షణారాహిత్యంగా చూస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే.. ఈ ‘అలవిమాలిన స్వేచ్ఛ’ఆ పార్టీకి పెద్ద బలహీనతగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ముఖ్యమంత్రిని అగౌరవపరిచేలా మాట్లాడటం వంటి పరిణామాలు కాంగ్రెస్‌లో పెద్ద దుమారాన్నే రేపాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి సురేఖకు నోటీసులు వెళ్లడం, దానిపై ఆమె స్పందించిన తీరు కూడా చర్చనీయాంశమైంది. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు సమావేశమై మంత్రి సురేఖపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
ఈ వ్యవహారంలో నష్ట నివారణకు ప్రయత్నాలు జరిగినప్పటికీ.. వివాదం అంత తేలిగ్గా సద్దుమణగలేదు. చివరకు పార్టీ అధిష్ఠానం నిర్ణయం ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇదే సమయంలో పరకాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. అయితే పార్టీ అభ్యర్థులను, ముఖ్యమంత్రిని నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్ఠానమే అన్నది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ.. పార్టీ అంతర్గత పరిస్థితులు, ప్రభుత్వ స్థిరత్వంపై ప్రజల్లో నమ్మకం కల్పించాలనే ఉద్దేశంతోనే రేవంత్ ఘాటైన వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్న అభిప్రాయం ఆయన అనుకూల వర్గాల్లో వినిపిస్తోంది.
కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలు ఒక్క వ్యవహారంతోనే ఆగిపోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల మధ్య విభేదాలు బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి. చిన్నారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితర నేతల వ్యాఖ్యలు కూడా పార్టీ వ్యవహారశైలిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నాయకుల మధ్య విభేదాలు, బహిరంగ విమర్శలు, పరస్పర ఆరోపణలు కొనసాగితే.. దాని ప్రభావం ప్రభుత్వ ప్రతిష్ఠపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజలకు నిరంతరం రాజకీయ వివాదాలే కనిపిస్తే.. పాలనపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది.
అధిష్ఠానం క్రమశిక్షణ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించకపోతే.. భవిష్యత్తులో మరింత మంది నాయకులు పార్టీ పెద్దలపై, ముఖ్యమంత్రి సహా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులపై బహిరంగంగా విమర్శలు చేసే పరిస్థితి రావచ్చు. అదే జరిగితే కాంగ్రెస్‌లోని అంతర్గత ప్రజాస్వామ్యం క్రమంగా క్రమశిక్షణారాహిత్యానికి దారితీసే ప్రమాదం ఉంది.
అంతర్గత ప్రజాస్వామ్యం అనేది పార్టీలకు బలం కావచ్చు. కానీ దానికి హద్దులు లేకపోతే అదే బలహీనతగా మారుతుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈ పరిణామాలను ఎంత త్వరగా చక్కదిద్దుకుంటుందో, నాయకుల మధ్య విభేదాలకు ఎంతవరకు అడ్డుకట్ట వేస్తుందో భవిష్యత్ రాజకీయాలకు కీలకం కానుంది.