ఇప్పటివరకు ఎవ్వరిని అభ్యర్థులుగా ప్రకటించలేదు:రేవంత్​రెడ్డి

ఇప్పటివరకు ఎవ్వరిని
అభ్యర్థులుగా ప్రకటించలేదు

  • దరఖాస్తు నమూనా విడుదల

హైదరాబాద్, ఆగస్టు 18 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో ఇప్పటి వరకు తామే అభ్యర్థులమంటూ ఎవరైనా చర్చించుకున్నా.. అవన్నీ ఊహాగానాలే అవుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎవ్వరిని అభ్యర్థులుగా ప్రకటించలేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం.. నమూనా దరఖాస్తును గాంధీభవన్‌లో రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాస్కీ, అంజన్‌కుమార్ యాదవ్, ఇతర నేతలు విడుదల చేశారు.

ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.25,000.. బీసీ, ఓసీ అభ్యర్థులకు రూ.50,000 దరఖాస్తు రుసుము నిర్ణయించినట్లు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు నుంచి ఈనెల 25 వరకు వీటిని స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు.. వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తాయని రేవంత్​రెడ్డి వెల్లడించారు.

అర్జీలు ఇచ్చిన అభ్యర్థులు.. వారు పార్టీకి చేసిన సేవలు, సర్వేలు, గెలుపు ప్రాతిపదికన నివేదిక తయారు చేస్తామని రేవంత్​రెడ్డి వెల్లడించారు. దీనిని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్దారించిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఫైనల్ అయినట్లు మీడియాలో వచ్చే కథనాలను నమ్మొద్దని సూచించారు. గతంలో హామీ ఇచ్చారని.. జరిగే ఊహాగానాలకు తావు లేదని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలెవరైనా.. తనతో సహా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని పునురుద్ఘాటించారు. నమూనా దరఖాస్తును ఆన్‌లైన్‌లోనూ తీసుకోవచ్చని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *