టాలీవుడ్ దిగ్గజ నటుడు
కోట శ్రీనివాసరావు కన్నుమూత

హైదరాబాద్, జూలై 13 (విశ్వం న్యూస్): తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు… ప్రముఖ సినీనటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు.
తన విలక్షణ నటనతో అశేష ప్రేక్షకాదరణ పొందిన కోట, దాదాపు 750కు పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో ఆయన నటనా వైభవం చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఎన్నో రాష్ట్ర, కేంద్ర, సినీ అవార్డులు ఆయనను వరించాయి.
కోట శ్రీనివాసరావు మరణ వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్రంగా దిగ్బ్రాంతి చెందారు. ఆయన సేవలను స్మరిస్తూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.