ఆంధ్ర కుట్రలు మళ్లీ తెరపైకి! : నందిని సిద్ధారెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • తెలంగాణపై తిరిగి విలీన కుట్ర –గట్టిగా తిరగబడాలి!

హైదరాబాద్, జూలై 12 (విశ్వం న్యూస్): తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో కలిపే కుట్రలు జరుగుతున్నాయని ఆయన గట్టిగా హెచ్చరించారు. చంద్రబాబు చెప్పు చేతుల్లో నడిచే పత్రికలు, నాయకులు అదే దిశగా పావులు కదుపుతున్నారని నందిని సిద్ధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్ర మీడియా అధినేత రాధాకృష్ణ “కొత్త పలుకులు” పేరిట రాసిన వ్యాసం లో బీఆర్ఎస్‌పై విమర్శల ముసుగులో తెలంగాణ అస్థిత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారని, ఇది చిన్న విషయం కాదని స్పష్టం చేశారు. “ఇప్పుడిప్పుడే తెలంగాణ, ఆంధ్ర అనే భావనలు లేకుండా అందరూ సంతోషంగా ఉన్నారు” అనే వాక్యం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని కోరారు.

రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు – ముగ్గురూ ఒకే ఆలోచనా దిశలో పయనిస్తున్నారని, తెలంగాణ బొమ్మలను స్తబ్ధం చేయడమే వారి లక్ష్యమని మండిపడ్డారు.

తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి మౌనంగా ఉంటే – లోగోలో కాకతీయ తోరణం  మాయమవుతుంది, తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ కనిపించదు, భారతదేశ పటంలో తెలంగాణే కనిపించకుండా చేస్తారు.ఇవి అన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్న అంశాలు కావు –పక్కా ప్రణాళికతో, కుట్రాత్మకంగా జరుగుతున్న కార్యక్రమాలు అని నందిని సిద్ధారెడ్డి పునరుద్ఘాటించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ప్రాంతీయత, అస్తిత్వం కోసం. ఆ ప్రాంతీయత, ఆత్మగౌరవం ఇక్కడి మట్టిలో, మనుషుల హృదయాల్లో ఉన్నంతకాలం, తెలంగాణ ఉద్యమ భావన మసకబారదని అన్నారు. ఈ కుట్రలపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చరిత్రను మరిచి, గుర్తింపులను పోగొట్టుకోవడం సులువు కాదు. ప్రతి తెలంగాణవాడి కర్తవ్యం – తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *