వీ.. వాంట్ టాయిలెట్స్…!!! ప్రభుత్వమా..!! పరిస్థితి అర్థమవుతుందా…?

- మహబూబాబాద్‌లో నర్సింగ్ విద్యార్థినుల ఆవేదన
మహబూబాబాద్, జనవరి 6, 2026 (విశ్వం న్యూస్) : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాల విద్యార్థినుల ఆగ్రహం రోడ్లపైకి వచ్చింది. “వీ.. వాంట్ టాయిలెట్స్…!!! ప్రభుత్వమా..!! పరిస్థితి అర్థమవుతుందా…?” అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థినులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కళాశాల ప్రాంగణంలో సరైన మరుగుదొడ్లు, నీటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ముఖ్యంగా విద్యార్థినులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇక సహనం కోల్పోయిన విద్యార్థినులు నిర్బంధపు గేట్లు నెట్టుకొని బయటకు వచ్చి రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ… నర్సింగ్ విద్య అనేది మానవ సేవకు పునాది అని, అలాంటి విద్యను అభ్యసించే తమకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. భవిష్యత్తులో రోగుల ప్రాణాలు కాపాడాల్సిన విద్యార్థినులనే ఈ విధంగా అవమానకర పరిస్థితుల్లో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
నిరసన సమాచారం అందుకున్న స్థానిక అధికారులు అక్కడికి చేరుకొని విద్యార్థినులతో చర్చలు జరిపారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కొంతకాలం తరువాత విద్యార్థినులు శాంతించారు. అయినప్పటికీ తమకు లిఖితపూర్వక హామీతో పాటు వేగవంతమైన చర్యలు కావాలని విద్యార్థినులు స్పష్టం చేశారు.
ఇకైనా ప్రభుత్వం స్పందించి నర్సింగ్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థినులు హెచ్చరించారు.