సీఎం అమెరికా టూర్‌పై కేంద్రం, రాష్ట్రం సమాధానం చెప్పాలి

సీఎం అమెరికా టూర్‌పై కేంద్రం, రాష్ట్రం సమాధానం చెప్పాలి

సీఎం అమెరికా టూర్‌పై కేంద్రం, రాష్ట్రం సమాధానం చెప్పాలి

  • Inappropriate’ అంటే ఏమిటి? అసలు కారణాలు బయటపెట్టాలి: దాసోజు శ్రవణ్

విశ్వమ్‌న్యూస్‌, హైదరాబాద్‌, ఆగస్టు 22: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం పొలిటికల్‌ క్లియరెన్స్‌ నిరాకరించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ (MEA) ఉపయోగించిన ‘Inappropriate’ అనే పదానికి అసలు అర్థం ఏమిటో కేంద్రం స్పష్టం చేయాలని కోరారు.

సీఎం హోదాకు, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా లేని కార్యక్రమాలు లేదా సమావేశాలు ఏవో, వాటిపై కేంద్రానికి అభ్యంతరం ఎందుకు వచ్చిందో వెల్లడించాలని శ్రవణ్‌ అన్నారు. ముఖ్యంగా ఆగస్టు 27 నుంచి 30 వరకు అమెరికాలో సీఎం ఎవరెవరిని కలవాల్సి ఉందో అధికారిక షెడ్యూల్‌లో స్పష్టత లేదని ప్రశ్నించారు. ఆ నాలుగు రోజుల పూర్తి కార్యక్రమాలు, సమావేశాలు, ఆహ్వానాలు ఎవరి నుంచి వచ్చాయో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

న్యూయార్క్‌ మేయర్‌ జొహ్రాన్‌ మందానిని కలవడం వల్లే పర్యటనకు అనుమతి నిరాకరించారనే ప్రచారం జరుగుతోందని, అదే నిజమైతే అధికారిక షెడ్యూల్‌లో మందాని పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు. మందాని పేరును రాజకీయ కవర్‌గా ఉపయోగించకుండా అసలు కారణాలను కేంద్రం వెల్లడించాలని అన్నారు.

2024లో అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. 2026లో ఎందుకు నిరాకరించిందో చెప్పాలని శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. అప్పటికి లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలని అన్నారు.

ఈ పర్యటన తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికా.. లేక వ్యక్తిగత పెట్టుబడులు, వ్యాపార ప్రయోజనాల కోసమా అనే ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని కోరారు. ‘Inappropriate’ అనే ఒక్క పదం వెనుక దాక్కోకుండా అమెరికా పర్యటనకు పొలిటికల్‌ క్లియరెన్స్‌ ఎందుకు నిరాకరించారో కేంద్రం, పర్యటన ఉద్దేశం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు పూర్తి వివరాలతో వెల్లడించాలని దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *