హుజూరాబాద్ డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేయాలి

హుజూరాబాద్, మే 2 (విశ్వం న్యూస్) : హుజూరాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన రక్తంతో లేఖ రాసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు.
హుజూరాబాద్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసికట్టుగా ముందుకు వచ్చి సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజల వెంట నిలవాలని ఆయన కోరారు. డంపింగ్ యార్డ్ వల్ల దుర్వాసన, గాలి కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అదే విధంగా భూగర్భ జలాలు కలుషితమై తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దోమలు, ఈగలు పెరిగి అంటువ్యాధులు వ్యాపించే అవకాశముందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు.


