33 ఏళ్ల తర్వాత ఘనంగా
ఆత్మీయ సమ్మేళనం

- అరవింద విద్యాలయపు
1992 బ్యాచ్ పూర్వ విద్యార్థుల
భావోద్వేగ భేటీ
మహబూబాబాద్, జూన్ 29 (విశ్వం న్యూస్): ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి… చివరకు చదువులమ్మ తల్లి నీడలో కలుసుకున్న మిత్రుల మధుర మలయజాలమిది! 1992లో అరవింద విద్యాలయంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 33 ఏళ్ల తర్వాత ఘనంగా కలుసుకున్నారు. మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఈ అపురూప సంఘటనకు వేదికైంది.

సుమారు 50 మంది పూర్వ విద్యార్థులు చిన్ననాటి స్కూల్ డ్రెస్‌లలో హాజరై తమ విద్యా జీవిత జ్ఞాపకాలను తడిమారు. ఎన్నో క్షణాలను గుర్తుచేసుకొని, కలిసిమెలిసి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. ఐర్లాండ్, లండన్, అమెరికా, బహ్రెయిన్ వంటి దేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. వృత్తి, వ్యాపార జీవితాలతో ఎవరు ఎక్కడున్నా… ఆ ఒక్కరోజు కోసం వచ్చారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని కన్నీటి చిమ్మే క్షణాలను పంచుకున్నారు. అందరి ముఖాల్లో ఆనందకాంతి మెరిసింది.
ఈ కార్యక్రమంలో తమకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. చంద్రదేవ్, కుమారస్వామి, సలీం, నాగేశ్వర్ రావు, శ్రీరామరావు, ఫజల్, లక్ష్మీనారాయణ, వీరాస్వామి లాంటి ఉపాధ్యాయులకు శాలువాలతో ఘన సన్మానం చేశారు.
- ఓంప్రకాష్ (ఐర్లాండ్ నుంచి): “ఇంకా కలుస్తామన్న ఆశ ఉండదు అనుకున్నాం… కానీ ఈ సమ్మేళనం మా జీవితంలో చిరస్మరణీయం.”
- ప్రమోద్ (లండన్ నుంచి): “చిన్ననాటి స్నేహితుల్ని చూడడం అనుకోని వరం లాంటిది.”
- ఉషశ్రీ (పూర్వ విద్యార్థిని): “చిన్నతనం జ్ఞాపకాల్లో మునిగిపోయాం. ఆనందాన్ని మాటల్లో చెప్పలేం.”